దానికి చాక్లేట్లు వేలాడదీయాలని, గ్రీటింగ్స్ కట్టాలని.. శాంతాక్లాజ్ తాత నుంచి బహుమతి పొందాలని అభిలాష.
కానీ వాళ్ల నాన్నకి కోపం కాస్త జాస్తి. ఒక రకంగా సాంప్రదాయాలికి విలువ ఇచ్చే మనిషి. ఆయన్ని క్ర్ర్రిస్మస్ చెట్టు పెట్టాలని అడగడానికి సునీతకు ధైర్యం చాలలేదు. చివరకు క్రిస్మస్ చెట్టు మాట, శాంతాక్లాజ్ తాత బహుమతి మాట మరుగున పడిపోయాయి.
సునీతకు పెళ్లయ్యింది. ఒక బాబు, పాప. బాబు పేరు అభిలాష్. పాప పేరు అపరంజి. అభి అని వాడిని ముద్దుగా పిలుస్తారు. అభిని స్కూల్లో చేర్పించారు. కేజి చదువుతు న్నాడు. వాడు స్కూల్ నుంచి రావడంతోనే 'క్రిస్మస్ ట్రీ కావాలి' అని పేచీ పెట్టాడు.. అభి వాళ్ల నాన్న తెలివిగా.. 'అది మన పండుగ కాదు' అన్నారు. వెంటనే అభి 'అలానే..! అయితే మరి ఎవరి పండుగ?' అన్నాడు. అభి వాళ్ల నాన్న తన ఫ్రెండ్స్ పేర్లు చెప్పారు. వెంటనే అభి 'మరి దీపావళి పండుగను వారు కూడా చేసుకున్నారు. ఎందుకు..?' అమాయకంగా మొహం పెట్టి అడిగాడు.
అంతే అభి వాళ్ల నాన్నకి ఏం మాట్లాడాలో అర్థంకాలేదు. వాడికో పెద్ద చాక్లెట్ ఇచ్చి అప్పటికి మాయపుచ్చాడు.
రెండేళ్లు గడిచిపోయాయి.
ఆరోజు అభిలాష్ స్కూల్ నుండి వస్తూనే క్రిస్మస్ కార్డుతో పాటు.. శాంతాక్లాజ్ తాత బహుమతి మాట కూడా చెప్పి.. 'ఈసారి ఏమైనా క్రిస్మస్ ట్రీ పెట్టాల్సిందే' అని మంకుపట్టు పట్టాడు. అంతేకాదు వాళ్ల నాన్నచేత కొనిపించాడు.
ఒక్కసారిగా సునీతకు తన చిన్ననాటి కోరిక గుర్తుకొచ్చింది. ఎంతో ఆసక్తిగా ఆ క్రిస్మస్ చెట్టుని అలంకరించింది. చాక్లేట్లు వేలాడదీసింది. అభిలాష్, అపరంజి ఆ క్రిస్మస్ ట్రీని చూసి చాలా సంబరపడిపోయారు. అభి మోము ఆనందంతో వెలిగిపోయింది. సునీత మనస్సులో మాత్రం.. 'వీడిలాగా నేనూ అప్పుడు మా నాన్నను అడిగుండాల్సింది' అనుకుంది.
క్రిస్మస్ చెట్టు పెట్టగానే.. 'సునీతా మతం మారారా?.., అలా పెట్టకూడదు.. ఫరవాలేదా?.. మీ మతంలో ఏం కాదా?' అని రకరకాల ప్రశ్నలు గుప్పించారు చుట్టుపక్కలవాళ్లు. సునీతకైతే.. 'ఏంటి? ఇంత చదువులు చదువుకునీ.. వీళ్ల పోకడ' అనిపించింది.
'మీ దేవుడు ప్రసాదమా? అయితే వద్దు.. జీసస్‌కి కోపం వస్తుంది' అంటూ తినే క్రిస్టియన్లు.. 'క్రిస్మస్ ట్రీ పెడితే అపచారం'.. అంటూ ఏదో ఘోరం జరిగిపోతుందనే హిందువులను చూస్తే ఇదేంటి వీళ్లిలా.. అనిపిస్తుంది..' అనుకోకుండా ఉండలేకపోయింది సునీత.
సునీత స్నేహితులు మాత్రం 'బాగుంది. భలే పెట్టావ్.. భలే ఆలోచన' అని ప్రోత్సహించారు.
ఏ పూజ చేసినా సునీతకు ప్రసాదం దగ్గరి నుంచి అన్నిపనులూ చేసిపెట్టే మిత్రులూ ఉన్నారు. సునీత ఇంటికి ప్రతి పండక్కి, ప్రత్యేకంగా వినాయకచవితికి వచ్చి 'గణపతి పప్పా మోరియా' అని మొక్కే క్రిస్టియన్ మిత్రులూ ఉన్నారు.
'వాళ్ళవల్లనే అబ్బిందే ఏమో ఈ సమానత్వం' అనుకోకుండా ఉండలేకపోయింది సునీత.
సునీత పుట్టింది హిందూ కుటుంబంలో. చదువుకుంది క్రిస్టియన్ స్కూల్‌లో, కాలేజీలో. ఉంటుందేమో ముస్లిం దేశంలో. అందువల్లనో ఏమో తనకు అన్నీ ఒకటే అనిపిస్తుంది. ఎవర్ని ఎవరూ తక్కువ చేసినా బాధపడుతుంది. మనమంతా ఒక్కటే అంటుంది.
నిజంగానే మనమంతా ఒక్కటే కదా..!
(యథార్థ సంఘటనకు కథా రూపం..)
- శాంతిశ్రీ
No comments:
Post a Comment