Saturday, May 7, 2011

అమ్మ చెప్పిన ఎనిమిది అబద్ధాలు..


చిన్నారులూ....!
'అమ్మ అన్నది ఒక కమ్మని మాట... అది ఎన్నో ఎన్నో తెలియని మమతల మూట..' అన్నాడో సినీకవి.
అమ్మకో రోజు.. నాన్నకో రోజు... కేటాయించి 'ప్రేమ'ను సరుకుగా మార్చి, వ్యాపారం చేసుకునే సంస్కృతి నేటి మార్కెట్‌వ్యవస్థలో సర్వసాధారణమైపోయింది. ఈ భ్రమలో పడి ఆ ఒక్కరోజుకే పరిమితం కాకుండా అమ్మానాన్నను కలకాలం ప్రేమించండి. అమ్మ ప్రేమ ఎంతో స్వచ్ఛమైంది. కల్మషం లేనిది. అయితే అమ్మ అప్పుడప్పుడూ మనతో కొన్ని అబద్ధాలూ చెపుతూ ఉంటుంది కదూ! ఇవి ప్రతి ఒక్కరికీ అనుభవమే.. అందుకే మీలాంటి ఓ చిన్నారి తనతో అమ్మ చెప్పిన ఎనిమిది అబద్ధాల గురించి ఒక కథ చెప్తున్నాడు.. ఈ కథ మన హృదయాల్ని తడుతూ.. మనందరి జ్ఞాపకాలతో పందరి వేస్తుంది.. మరి ఆ కథేంటో చదవండి...!

మా గుడిసెలో అమ్మా.. నేనూ ఉంటాం.
స ఈ కథ మొదలులో నేను చాలా చిన్నవాడిని. నేను చాలా పేద కుటుంబంలో పుట్టాను. మాకు సరైన తిండి కూడా దొరికేది కాదు. నాకు ఆకలేసినప్పుడు అమ్మ చాలా కష్టపడి కొన్ని బియ్యం తెచ్చి వండేది. అదీ చాలా కొద్దిగా మాత్రమే. తనకు మిగుల్చుకోకుండా అన్నం మొత్తం నాకే పెట్టేసేది. 'మరి నీకేదమ్మా' అంటే.. 'నువ్వు తిను నాన్నా!.. నాకు ఆకలేయడం లేదు..' అంటూ అమ్మ చెప్పిన మొదటి అబద్ధం నాకు జ్ఞాపకమే.

* అప్పుడే నేను కొంచెం పెద్దగా అవుతున్నాను. నా ఎదుగుదలకు అవసరమని మా ఇంటికి దగ్గరలో ఉన్న చెరువు దగ్గర ఓ చిన్న చేప పట్టుకొచ్చి వండింది మా అమ్మ. నా పక్కనే కూర్చొని వడ్డిస్తూ.. చేప ముక్కలను ముళ్లు లేకుండా తీసి పెడు తోంది. నాకు బాగా నచ్చి రెండు ముక్కలు తినేశాను. ఇంక ఒక ముక్కే ఉంది అదీ నాకే వేయమని అమ్మ తినలేదని గుర్తుకొచ్చి.. 'నువ్వు తినమ్మా!' అన్నా. 'నువ్వు తిను చిన్నా! నీ ఆరోగ్యానికి చేప ఎంతో మంచిది. నిజంగా నాకు చేపంటే అసలు ఇష్టం లేదు' అంటూ అమ్మ చెప్పిన రెండో అబద్ధం నేను మర్చిపోలేను.

స నేను ప్రైమరీ క్లాసులో ఉన్నప్పుడు.. నా అవసరాల తీర్చేందుకు అమ్మ ఎంతో కష్టపడి డబ్బు సమకూర్చేది. ఆఖరుకు అగ్గిపెట్టి కొనడానికీ డబ్బులు ఒకోసారి ఉండేవి కావు. నేను బాగా చదువుకోవాలని అమ్మ ఆశ. అందుకే ఎంతో శ్రమకోర్చి కొవ్వొత్తు కొనుక్కొచ్చి వెలిగించింది. రాత్రిపూట చదువుకుంటున్న నాకు తోడుగా అలాగే కూర్చుంది. 'అమ్మా! చాలా టైమైంది. నువ్వు వెళ్లి నిద్రపో. మళ్లీ రేపు పనిలోకి వెళ్లాలి' అన్నా. 'మరేం ఫర్వాలేదు బాబూ..! నేనేమీ అలసిపోలేదు' అంటూ అమ్మ చెప్పిన మూడో అబద్ధం నాకు బాగా గుర్తు.

* అప్పుడు నాకు సంవత్సరాది పరీక్షలు జరుగు తున్నాయి. అది చివరి పరీక్ష. ఆరోజు అమ్మ మధ్యాహ్నం నుండి పనికి సెలవు పెట్టింది. నేను వచ్చేటప్పటికి నాకోసం ఎదురుచూస్తూ ఇంటి దగ్గరే ఉంది. రాగానే నన్ను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంది. చిక్కటి పాయసం గ్లాసులో పోసి తెచ్చింది. అదేమీ అమ్మ ప్రేమంతా చిక్కగాలేదనుకోండి..! నేను గ్లాసు తీసుకొని తాగుతూ.. 'అమ్మా! నువ్వూ తాగు..' అన్నా. 'నువ్వు తాగు కన్నా! నాకు తాగాలనే లేదు..' అంటూ అమ్మ చెప్పిన నాలుగో అబద్ధం నా మదిలో అలాగే నిలిచిపోయింది.

* చెప్పడం మర్చాను. నా చిన్నప్పుడే మా నాన్న అనారోగ్యంతో చనిపోయాడు. మా అమ్మే నాన్న బాధ్యతలు కూడా చూసేది. ఆమె పొలంలో పనిచేసేది. ఇంటి అవసరాలన్నీ ఆమె ఒక్కతే చూసుకోవాలి. చాలా కష్టంగా ఉండేది. మా బంధువులు 'చిన్నవయస్సు.. ఒక్కదానివే ఏం కష్టపడతావు. మన బంధువుల్లో ఒక ఆయన నిన్ను వివాహం చేసుకొని, నిన్నూ నీ బిడ్డని చూస్తానంటున్నాడు. ఎన్నాళ్లిలా ఒంటరిగా ఉంటావ్‌? నీకూ ఓ తోడు అవసరం. పెళ్లి చేసుకో' అని చెప్పారు. 'నాకేమీ తోడు అవసరం లేదు' అంటూ అమ్మ చెప్పిన ఐదో అబద్ధం నా హృదయాన్ని కదిలించేసింది.

* నా చదువు పూర్తయ్యింది. ఉద్యోగం కూడా దొరికింది. అమ్మ కూడా పనిచేయలేక పొలం వెళ్లడం లేదు. కానీ ఆమె ఉదయమే మార్కెట్లో కూరగాయలు అమ్ముతోంది. అలా వచ్చిన డబ్బులతో తన అవసరాలు తీర్చుకునేది. నేనేమో వేరే పట్టణంలో పనిచేస్తున్నా. నేను డబ్బు ఇస్తే.. వద్దంటూ తిరిగి ఇచ్చేస్తూ 'నాకు వచ్చే డబ్బులు సరిపోతున్నాయి' అంటూ అమ్మ చెప్పిన ఆరో అబద్ధం నేనెన్నటికీ మర్చిపోలేను.
స మెరిట్‌ స్కాలర్‌షిప్‌తో నేను మాస్టర్‌ డిగ్రీ చేశాను. నేను పనిచేసే కంపెనీ వాళ్లు అమెరికాకు పంపుతామన్నారు. బోలెడంతా జీతం ఇస్తామన్నారు. అమ్మను కూడా నాతో తీసుకెళ్లడానికి కూడా అనుమతివ్వమని కోరా. అందుకు వారు పరిశీలిస్తామన్నారు. ఎంతో సంతోషంతో విషయం అమ్మకు చెప్పాను. 'అమ్మా నువ్వూ నాతో రావాలి!' అన్నా. 'వద్దు నాన్నా..! నన్ను తీసుకెళ్లడం వల్ల నీకెటువంటి ప్రయోజనం ఉండదు' అంటూ అమ్మ ఆడిన ఏడో అబద్ధం నేను మరవలేను.

* అమ్మకు ముసలితనం వచ్చేసింది. ఆమె క్యాన్సర్‌తో ఆసుపత్రిపాలైంది. విషయం తెలియగానే బయల్దేరి సరాసరి నా ప్రియమైన అమ్మ దగ్గరకు చేరుకున్నా. ఇన్నాళ్లూ తన ఆరోగ్యం గురించి నేనడిగినప్పుడల్లా 'బాగున్నా' అంటూ అబద్ధాలు చెపుతూ ఈ స్థితికి వచ్చింది. డాక్టర్లు ఆపరేషన్‌ చేశారు. ఆమె చాలా ముసలిగా అయిపోయింది. నవ్వుతూ ఉండే అమ్మ మొహం నేడు అలసిపోయి వడలిపోయి ఉంది. జబ్బు వల్ల ఆమ్మ మరింత బలహీనంగా ఉంది. అమ్మను ఆ పరిస్థితుల్లో అలా చూస్తుంటే నాకు చాలా బాధేసింది. అమ్మను ఎలాగైనా బతికించుకోవాలి అనుకున్నా. నా కళ్లెంట కన్నీళ్లు ఆగడం లేదు. 'ఏడ్వకు నా ప్రియమైన కన్నా! నాకేమీ బాధలేదు..' అంటూ అమ్మ ఆడిన ఎనిమిదో అబద్ధం నా గుండెను పిండేసింది. ఆ ఎనిమిదో అబద్ధం చెపుతూ అమ్మ శాశ్వతంగా కన్ను మూసింది. అందుకే అమ్మ ప్రేమ అవ్యక్తమైనది.. అపారమైనది.. స్వార్థం ఎరుగనిది. డబ్బు పెట్టి కొనలేము.. అమ్మ రుణం తీర్చుకోలేము..
స్వేచ్ఛానువాదం.. - శాంతిశ్రీ

No comments:

Post a Comment