Saturday, February 4, 2012

పుస్తకం


చరిత్రను నింపుకుంటుంది
జీవితాల్ని చదివిస్తుంది
దు:ఖాన్ని కలిగిస్తుంది
విచారాన్ని వెల్లడిస్తుంది
కోపాన్ని వెళ్లగక్కుతుంది
ప్రేమను పంచుతుంది
ఉద్యమాలకు దిక్సూచవుతుంది
సమానత్వం పాటిస్తుంది
పేద-గొప్ప స్త్రీ-పురుష చిన్నా-పెద్ద
మంచీ-చెడ్డా ప్రేమ-కోపం
తారతమ్యాలు లేవంటుంది
అన్నింటికీ చోటిస్తుంది
ఎద లోతుల్ని తడుముతుంది
అమ్మలా హత్తుకుంటుంది
నాన్నలా దిశను నిర్దేశిస్తుంది
సహచరుడిలా తోడుంటుంది
నేస్తమై వెన్నంటి ఉంటుంది
రెక్కలున్నట్లే ఎగిరిపోతుంది
ప్రపంచాన్ని చూపిస్తుంది
నిజాల్ని వెల్లడిస్తుంది
అసత్యాల్నీ మూటగడుతుంది
కాగితాలను కలిపేసుకుంటుంది
కవిత్వాల్ని కౌగిలించుకుంటుంది
కథల్ని కళ్లకుగడుతుంది
గ్రంథాలను గౌరవిస్తుంది
రచయితలకు వెలుగునిస్తుంది
కొత్తదనాన్ని రుచి చూపిస్తుంది
పాతదనాన్ని సమీక్షిస్తుంటుంది
విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది
విచక్షణను మేలుకొల్పుతుంది
విద్వేషాలనూ రగిలిస్తుంది
విప్లవాలను జ్వలింపజేస్తుంది
సాహిత్య సేద్యంలో కీలకమవుతుంది
భాండాగారాల్లో నిక్షిప్తమౌతుంది
పరిజ్ఞానానికి ఆధారమవుతుంది
పరిహాసాలకూ చోటిస్తుంది
దరహాసాలనూ చిందిస్తుంది
నిరసనలకూ వేదికవుతుంది
గర్వంతో మిడిసిపడుతుంది
మస్తిష్కాల్లో దూరిపోతుంది
మనస్సులను ప్రభావితం చేస్తుంది
చైతన్యాన్ని పెంపొందిస్తుంది
నిరుత్సాహాన్ని కలిగిస్తుంది
ఉత్తేజాన్ని రేకెత్తిస్తుంది
ఆవేశాలను రగిలిస్తుంది
ఉత్సాహానికి పురికొల్పుతుంది
భావోద్వేగాలకి ఆలవాలమవుతుంది
బాధ్యతల్ని గుర్తు చేస్తుంది
తన ప్రస్థానం అనంతమంటుంది
తననెవరూ ఆపలేరంటుంది
తనకెవరూ ఎదురులేరంటుంది

- శాంతిశ్రీ

1 comment: