Sunday, November 21, 2010

ఆఖరి ఆకు

- శాంతిశ్రీ 
'' 'ది లాస్ట్‌ లీఫ్‌' అనే పేరుతో ఓ. హెన్రీ అనే ప్రసిద్ధ అమెరికన్‌ రచయిత కలం నుండి ఈ కథ జాలువారింది. ఇది మా చిన్నప్పుడు చదువుకున్న కథ. ఈ ఏడాది మీకోసం చెపుతున్నా. మీరందరూ ఇది మీ మీ ఇళ్లకు వెళ్లాక, మీ తల్లి దండ్రులకు, స్నేహితులకు చెప్పండి..'' అంటూ డా|| రమేష్‌ మామయ్య కథ చెప్పటం ప్రారంభించారు.. కథలోకి వెళితే..

అమెరికాలోని కాలిఫోర్నియాకు దగ్గరగా ఉన్న ఓ గ్రామంలో జోన్సీ, స్యూ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరూ ఒకర్నివిడిచి ఒకరు ఉండేవారు కాదు. ఎంతో అనోన్యంగా, ఆనందంగా ఉండేవారు. ఎక్కడకు వెళ్లినా కలిసే వెళ్లేవారు. కలిసే ఉండేవారు. ఒకరోజు అనుకోకుండా జోన్సీకి జ్వరం వచ్చింది. ఎన్ని రోజులైనా తగ్గటం లేదు. స్నేహితురాలిని డాక్టర్‌ దగ్గరకు తీసికెళ్లింది స్యూ. డాక్టర్‌ జోన్సీని నిశితంగా పరిశీలించారు. 'నీ స్నేహితురాలికి న్యూమోనియా వచ్చింది. అయితే ఇది నయమవడానికి మందులు ఉన్నాయి. కానీ ఆమె చావును కావాలని కోరుకుంటోంది. అదే ఆమెకు పెద్ద ప్రమాదం. ముందు ఆ ఆలోచన నుంచి నీ స్నేహితురాలిని బయటకు తీసుకురాగలిగితే ఆమె తప్పకుండా బతుకుతుంది' అని చెప్పారు.స్నేహితురాలి పరిస్థితికి స్యూ ఎంతో విచారించింది. ఎలాగైనా తన స్నేహితురాలిని బతికించుకోవాలనుకుంది. కానీ ఏం చేయాలో పాలుపోలేదు. ఎంత ఆలోచించినా ఒక్క ఉపాయం కూడా తట్టలేదు. ఇక లాభం లేదనుకుని స్నేహితురాలితో ఇలా మాట్లాడం మొదలుపెట్టింది.
'జోన్సీ! ఎందుకు నువ్వు ఇలా అయిపోతున్నావు?'
'నాకు చావు దగ్గరపడుతుంది. నాకన్నీ తెలుస్తున్నాయి..' బదులిచ్చింది జోన్సీ. 'నీకేమన్నా పిచ్చా! చావు దగ్గరపడటం లేదు. నీవే చావు దగ్గరకు వెళుతున్నావు..' అంటూ మందలించినట్లు చెప్పింది స్యూ. 'ఏమో.. చావు దగ్గరకు నేను వెళుతున్నానో.. చావు నా దగ్గరకు వస్తుందో.. నాకు తెలియదు.. నేను చనిపోవడం మాత్రం ఖాయం' అంది జోన్సీ.
'అదే... ఎందుకలా అనుకుంటున్నావు?' కన్నీరు తుడుచుకుంటూ అడిగింది స్యూ.
'అదిగో ఆ కిటికీలోంచి చూడు. ఆ ద్రాక్ష తీగకు ఇంకా పద్నాలుగు ఆకులు మాత్రమే ఉన్నాయి. 14.. 13.. 12... 11.. అంటూ లెక్కపెట్ట సాగింది. 'ఎందుకలా లెక్కిస్తున్నావు?' ప్రశ్నించింది స్యూ. 'అవి ఒక్కొక్కటీ రాలిపోతున్న కొద్దీ.. నా చావు రోజు రోజుకు దగ్గర పడుతుంది...' అంది జోన్సీ.
రోజుకో ఆకు రాలిపోవడం ప్రారంభమైంది. ఇంకా రెండు ఆకులున్నాయి. ఆ రోజు ఆ రెండింటిలో ఒక ఆకు రాలిపోయింది. ఇంకా ఒకే ఒక్క ఆకు మిగిలింది. జోన్సీ తన స్నేహితురాలు స్యూని పిలిచింది. స్యూ దగ్గరకు రాగానే కిటికీలోంచి ద్రాక్ష తీగకున్న ఆ ఒక్క ఆకును.. ఆఖరి ఆకును చూపించింది స్యూ. స్యూ స్నేహితురాలిని గుండెలకు హత్తుకుంది. కొద్దిసేపటికి జోన్సీ నిద్రలోకి జారుకుంది. స్యూకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. కొద్దిసేపు ఆలోచించింది. ఇక లాభంలేదని ఏదన్నా ఉపాయం చెప్పమని స్యూ తమ వాటాకు కిందభాగంలో ఉన్న చిత్రకారుని వద్దకెళ్లి కోరింది. తన స్నేహితురాలి విషయమంతా చెప్పింది. స్నేహితురాలి కోసం స్యూ పడే తపన అతని హృదయాన్ని కదిలించింది. వారి స్నేహాన్ని ఎలాగైనా వాడిపోకుండా చూడాలనుకున్నాడు.
ఆ రోజు రాత్రి హోరున గాలి... విపరీతంగా మంచు కురుస్తుంది.. అది పెద్దదై మంచు తుపానుగా మారింది. ఎముకులు కొరికే చలి.. ఆ అననుకూల వాతావరణంలో లాంతరు పట్టుకుని ఆ చిత్రకారుడు ఎంతో ఇబ్బంది పడుతూ ఆ స్నేహితులకు తనవంతు సాయం చేశాడు.
తెల్లవారింది. జోన్సీ ఇదే తన జీవితంలో చివరి రోజు అనుకుంది. కిటికీలోంచి చూసింది. ఆ రాలిపోయే ఆకు పక్క నుండి ఓ చిన్న చిగురుటాకు ఉండటాన్ని గమ నించింది. అంతే జోన్సీలో కొత్త ఆశలు చిగురించాయి. తనలోనూ బతకాలన్న ఆశ చిగురులు తొడిగింది. రెండు, మూడురోజులైనా అలాగే నిలిచిన ఆ చిగురుటాకు జోన్సీలో ఆశని మరింత బలోపేతం చేసింది.
కానీ.. ఇంత సాహసం చేసి... జోన్సీ ప్రాణాలు నిలిపిన ఆ చిత్రకారుడు మాత్రం ఆ మంచు తుపానులో రాత్రంతా గడపడం వల్ల.. అప్పటికే న్యూమోనియాతో బాధపడు తుండటాన.. ఆ వ్యాధి తీవ్రమై మరణించాడు.
ఒకరి ప్రాణం కాపాడడానికి తన ప్రాణాన్నే తృణప్రా యంగా ఇచ్చిన ఆ చిత్రకారుడి త్యాగం ఎంత గొప్పదో కదా! స్నేహితురాలి కోసం స్యూ పడిన తపన కూడా అంతే గొప్పదే. మరి వీరిద్దరూ మనందరికీ ఆదర్శనీయులే కదా!
జైహింద్‌..! జై బాలోత్సవ్‌..!!

No comments:

Post a Comment