రచన: జి.వినయ్, (ఇంగ్లీషులో) వి.వి.విద్యాలయం, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా.
నేను చాలా అల్లరి పిల్లవాణ్ణి. నాకు ఐదేళ్లు. మా కుటుంబసభ్యులతో కలిసి ఒకసారి తిరుపతి వెళ్లాను. మేమంతా వెంకటేశ్వరస్వామిని దర్శించుకుందామని కొండపైకి నడుచుకుంటూ వెళుతున్నాము. అలా ఎక్కుతూ ఉంటే చుట్టూ ఉన్న ప్రకృతి నాకు బాగా నచ్చింది. ఆ మొక్కలు, పూలు ఎంతో బాగున్నాయి. సరిగ్గా మార్గం మధ్యలోకి వచ్చాము.
అక్కడో లోయ ఉంది. ఆ లోయ లోపల ఏముందో చూడాలన్న ఆసక్తి కలిగింది. అమ్మానాన్నకు చెప్పకుండా అటువైపు వెళ్లాను. అలా కొద్ది దూరం వెళ్లానో లేదో ఎక్కడనుండో ఎలుగుబంటు అరుపు వినిపించింది. వెంటనే నేను పరిగెత్తాను. ఆ ఎలుగుబంటు నన్ను చూడనే చూసింది. అంతే మరోవైపుకు మరింత వేగంగా పరిగెత్తడం ప్రారంభించాను. ఎటువైపు వెళుతున్నానో ఆ సమయంలో ఆలోచించలేదు. బాగా ఆయాసం వస్తుంటే ఆగాను. అప్పుడు చూస్తే నేనెక్కడున్నానో తెలియలేదు. నేవెళ్లాల్సిన దారి తెలియడం లేదు. అప్పుడు సమయం మధ్యాహ్నం రెండుగంటలు అయ్యింది. నాకు చాలా భయం వేసింది. చుట్టూ అడవి. నా భుజానికి తగిలించుకున్న సంచిలో ఏమేమి ఉన్నాయో అని చూశాను. అందులో అగ్గిపెట్టి, ఓ చిన్న టార్చిలైట్, ఓ స్క్రూ డ్రైవర్, కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి. ఇవేమి ఉపయోగపడతాయో అనుకుంటూ అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్లాను. చుట్టూ చెట్లు ఉండటాన చీకటిగా ఉంది. టార్చిలైట్ వెలిగించి చూశాను.
కనుచూపు మేరలో ఓ రోడ్డు కనిపించింది. ఆ రోడ్డుపై వాహనాలు వెళుతున్నాయి. కొందరు నడుచుకుంటూ వెళుతున్నారు. ఎవరూ ఇటువైపు చూడటం లేదు.హఠాత్తుగా ఎలుగుబంటు నా ముందుకొచ్చింది. నా మీద ఏ క్షణంలోనైనా దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. నాకు చాలా భయమేసింది. మెల్లగా వెనక్కు అడుగులు వేశాను. అప్పుడు నాకో మెరుపులాంటి ఆలోచన వచ్చింది. టీవీలో ఓ కథ చూస్తున్నపుడు అందులో హీరో అడవిలో జంతువును ఎదుర్కోడానికి మంటను చూపించిన దృశ్యం గుర్తుకొచ్చింది. వెంటనే నేను కూడా అగిపెట్టె తీసి అగ్గిపుల్లను వెలిగించి చూపించాను. ఎలుగుబంటు వెనక్కు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది.సాయంత్రం అయిపోయింది. ఇంకా ఆలస్యమైతే చీకటిపడిపోతుంది. వెంటనే నేను పెద్దగా అరవడం మొదలుపెట్టాను. ఆ రోడ్డుపై వెళుతున్న ఎవరూ ఇటు చూడనే చూడటం లేదు. నా గొంతులో నుంచి శబ్ధం కూడా చాలా మెల్లగా వస్తుంది. అది వాళ్లకు వినిపించేంత లేదు. కొద్దిసేపటికి ఆ రోడ్డు మీద అమ్మానాన్న పోలీసులతో కలిసి వెతుకుతూ కనిపించారు. కానీ నన్ను మాత్రం గుర్తించే స్థితిలో లేరు. వాళ్లు నాకు చాలా దూరంగా ఉన్నారు. నేను అక్కడ చేరుకోవడం కూడా చాలా కష్టమనిపించింది.
ఈ దట్టమైన చీకటిలో నేను ఎలాగో వారికి కనపడను. నన్ను వాళ్లు గుర్తించాలంటే ఒక్కటే మార్గం అనుకున్నా. వెంటనే బ్యాగ్‌లోంచి టార్చ్‌లైట్ తీసి వెలిగించి ఆ పొదల్లోంచి రోడ్డుమీద పడేలా ఫోకస్ చేశాను. కానీ అది చాలా చిన్నది అవటాన అంత వెలుతురు రావడం లేదు. అంత దూరం కూడా ఆ వెలుతురు వెళ్లడం లేదు.బాగా చలి వేస్తుంది. వణుకుతున్నా కూడా. అప్పుడు నా సైన్స్ పుస్తకంలోని పాఠం గుర్తుకొచ్చింది.. ఒక ట్యూబ్ నుండి తిన్నగా లైట్‌ను ఫోకస్ చేస్తే చాలా దూరం వెళుతుందన్న విషయం అందులో ఉంది. ఇప్పుడు నేనూ అలా చేయాలనుకున్నా. కానీ నా దగ్గర ట్యూబ్ లేదు. ఏం చేయాలా? అని ఆలోచి స్తున్నా. ఓ మెరుపులాంటి ఆలోచన తట్టింది. వెంటనే స్క్రూ డ్రైవర్‌కు ఓ పెద్ద ఆకును చుట్టి అందు లోంచి టార్చిలైట్‌తో లైట్ ఫోకస్ చేశాను. ఆ లైట్ నాకోసం వెతుకుతున్న పోలీసు మీద పడింది. వెంటనే ఆయన నేనున్న వైపు రావడం గమనించా. ఆయనతో పాటు మరికొందరు పోలీసులూ వస్తున్నారు. వాళ్లు వచ్చేవైపుకు లైట్ ఫోకస్ చేస్తూ అలాగే నిల్చున్నా. వాళ్లు దగ్గరకు వచ్చి, నన్ను అమ్మావాళ్ల దగ్గరకు తీసికెళ్లారు. ఇంకెప్పుడూ అమ్మావాళ్లకు చెప్పకుండా, వాళ్లను వదిలిపెట్టి వెళ్లకూడదని నిర్ణయించుకున్నా.
అనువాదం: శాంతిశ్రీ
No comments:
Post a Comment