ఆ బాలికకు పుట్టుకతోనే రెండుచేతులూ లేవు. అలా పుట్టిందని వాళ్లమ్మ మతిస్థిమితం కోల్పోయింది. రెండేళ్లప్పుడు కన్నతండ్రే రోడ్డుమీద వదిలి వెళ్లిపోయాడు. ఓ స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన శిక్షతో అన్నిపనులూ తనే చేసుకొంటోంది. ‘మౌనంగానే ఎదగమని మొక్కనీకు చెపుతోంది’ అన్న పాట ఈ పాప ప్రావీణ్యానికి అతికినట్లుంది. రాయడం దగ్గర
నుంచి భోజనం చేయడం వరకూ అన్నీ కాళ్లతోనే నేర్చుకుంది. అంతేకాదు. కాళ్లతోటే బొమ్మలు కూడా గీస్తోంది. ఆమె పేరు పూజాగుప్తా. పూజా గుజరాత్ అమ్మాయి.
ఈ గుజరాతీ గులాబీ మన బాలల దినోత్సవం రోజున జరిగిన 16వ అంతర్జాతీయ చలనచిత్రోత్స వానికి హైదరాబాద్‌కు విచ్చేసింది. ఈ ఉత్సవం దేశ, విదేశాల నుండి వచ్చిన 400 మంది చిన్నారి అతిథులతో కళకళలాడిన సంగతి మీకు తెలిసిందే. అయితే వీరందరిలోనూ పూజా ప్రత్యేక అతిథి అయ్యింది. అంగవైకల్యం ఉన్నా ఆత్మవిశ్వాసమే తన ఆయుధమంటూ దూసుకుపోతున్న చిన్నారి పూజా ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పూజా మాటలు వింటుంటే పెద్దలు కూడా పాఠాలు నేర్చుకోవాల్సిందే అనిపిస్తుంది. మరి ఈ గుజరాతీ గులాబీ ఏమందో ఆమె మాటల్లోనే…
‘ఎంతోమంది చిన్న విషయానికే ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. మరికొంత మంది మా నాన్నలా పిరికిగా సమస్యల నుండి పారిపోతుంటారు. మరికొంతమంది సున్నితంగా మా అమ్మలా పిచ్చివాళ్లు అయిపోతారు.. అలా కాకుండా అలాంటి బోలెడంతమందికీ నేను స్ఫూర్తిగా నిలవాలనుకుంటున్నా. అంతేకాదు సేవ కూడా చేయాలనుకుంటున్నా. సాధారణ పిల్లలకూ నాకూ ఏమీ తేడా లేదు. ఒక్క చేతుల విషయం తప్ప. మాది గుజరాత్, పుట్టినప్పుడే ఇలా పుట్టాను. అది చూసి అమ్మ పిచ్చిదైపోయింది. అలా పుట్టడంలో నా తప్పేం లేదుకదా! అయినా నాకు రెండేళ్లప్పుడు మా నాన్న నన్ను రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు. బహుశా ఆడపిల్లనీ.. అందులో ఇలా పుట్టాననేమో…! అలా అలా నేను మురికివాడలకు చేరాను.
అక్కడ తిరుగుతున్న నాకు సూరత్‌లోని ‘డిజేబుల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా’ వారు అమ్మానాన్నా అయ్యారు. నా పనులు నేనే చేసుకునేలా శిక్షణ ఇచ్చారు. చేతుల్లేకపోతే ఏమీ చేయలేమని నాక్కూడా మొదట్లో అనిపించేది. అలాగని ఏడుస్తూ కూర్చుంటే ఏం చేయలేం. ఈ విషయం నాకు ట్రస్ట్ సభ్యులు చెప్పిన మొదటి పాఠం. ఇది నాకు ఎంతో స్ఫూర్తి కలిగించింది. కాళ్లతో నా పనులు నేనే చేసుకోవాలన్న పట్టుదల నాలో కలిగింది. ట్రస్టు సభ్యులు సహకారంతో చాలా తొందరగా నేర్చేసుకున్నా. కాళ్లతో రాయడం దగ్గర నుంచి భోజనం చేయడం వరకూ అన్నీ నేర్చేసుకున్నా. కాళ్లతోనే బొమ్మలు గీయటమే కాదు పెయింటింగ్స్ కూడా వేస్తాను. ఇలాంటి ఉత్సవాల్లో మాలాంటివారినీ గుర్తిస్తారని నాకిప్పుడే తెలిసింది. ఇక్కడకు రావడం చాలా ఆనందంగా ఉంది. నాకు కార్టూన్స్ చూడటం అంటే భలే ఇష్టం. ఇక్కడ బోలెడన్ని కార్టూన్ సినిమాలు చూసే అవకాశం కలిగింది నాకు.’పూజా నిజంగా పిన్నలకూ చిన్నలకూ అందరికీీ స్ఫూర్తినిచ్చింది కదా!
- శాంతిశ్రీ
No comments:
Post a Comment