నాడు నార చీరలు ధరించేవారంటే ఏమిటో అనుకున్నాం.. ఇప్పుడదే పెద్ద ఫ్యాషనై కూర్చుంది. అంతే కాదు జూట్ పర్యావరణాన్ని పదికాలాల పాటు కాపాడుతోంది. నేడు జూట్ (నార) బ్యాగుల దగ్గర నుంచి చీరలు, నగల వరకూ వ్యాప్తి చెందింది. ఇందు కలను అందులేను సందేహం వలదన్నట్లు అన్నింటా తానేనంటోంది.. అంటోంది ఏంటి మీరే చూడండి.. మహిళలు ధరించే బ్యాగులు, పిల్లలు స్కూలుబ్యాగులు, షాపింగ్ బ్యాగులు, పిల్లల బొమ్మలు, టేబుల్
మాట్స్, కార్పెట్స్, రగ్గులు, ఫుట్ మ్యాట్స్, జాకెట్స్, చెప్పులు, కుషన్స్, నగలు, బుట్టలు, ఫర్నిచర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. ఎన్నెన్నో!
ఈ జూట్ వల్ల తయారుచేసిన వస్తువులు తొందరగా మట్టిలో కలిసిపోతాయి. ప్లాస్టిక్‌లా యేళ్ల తరబడి మట్టిలో తిష్టవేయవు. వాటిలా భూమిని విషతుల్యం చేయవు. అంటే పర్యావరణానికి జూట్‌వల్ల ఎలాంటి హానీ ఉండదు. అలాగే దీని తయారీకయ్యే ఖర్చు తక్కువ. దానివల్ల అందరికీ అందుబాటులో ఉంటాయి. కొనుక్కోవడానికీ, వాడుకోవడానికీ అంటే సౌలభ్యం, సౌకర్యం రెండూ చేకూరుతాయి. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పేపర్ బ్యాగులు వాడొచ్చు. కానీ అవి వర్షంలో తడిస్తే మెత్తబడి ఎందుకూ పనికిరావు. వీటితో ఆ సమస్యలేదు. స్టిఫ్‌గా కూడా ఉంటాయి.
ఎక్కువగా ఈ జూట్ రకాలను కూరగాయల నుండి తీసిన పీచుతోనే తయారుచేస్తున్నారంట. ఆశ్చర్యమనిపించినా ఇది నిజమే సుమా! ఇక మనకు తెలిసిన విషయమే అయినా మరోసారి చెప్పుకుందాం.. జూట్ వ్యవసాయ రంగంలో తన స్థానాన్ని పటిష్టపరచుకుంది.
పంట, ఎరువులు, కూరగాయల నిల్వకు, తరలింపుకు ఇవేగా ఉపయోగించేది! ఆహారపదార్థాలు నిల్వ చేసుకోవడానికి, ఎరువులు నిల్వ చేసుకోవడానికి, కూరగాయలను మార్కెట్‌కు తరలించడానికి ఒకటేమిటి చాలా రకాలుగా ఈ రంగంలో జూట్‌ను ఉపయోగిస్తున్నారు.
మొదట్లో జూట్ తయారీలు మోటుగా ఉండేవి. కానీ నేడవి సరికొత్త హంగులను సంతరించుకుని ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మెరుపులీనే సొగసులు రంగరించుకుని మగువ మనసును దోచుకుంటున్నాయి.
నేడు వస్త్రపరిశ్రమలో జూట్ ప్రవేశం ఒక సంచలనం. పట్టుతో పోటీగా జూట్ వస్త్రాలు మార్కెట్‌లో లభిస్తున్నాయి. పట్టు రేటులో సగం రేటుకే ఈ జూట్ చీరలు లభిస్తున్నాయి. కానీ ఆకర్షణలో ఏమాత్రం వెనకడుగు వేయడంలేదు. కాటన్ (పత్తి) స్థానాన్ని కూడా నేడు జూట్ ఆక్రమించేస్తోందంటే అతిశయోక్తి కాదు. ఇటీవల నేతకారులు తమ నైపుణ్యాన్ని జోడించి అరటి నారతోసైతం చీరలను తయారుచేస్తున్నారు.
ఇళ్లల్లో జూట్‌తో తయారుచేసిన అలంకార వస్తువులు కూడా మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. సామాన్యులకు ఖర్చు అందుబాటులో ఉండటమనేది సామాన్యుల ప్రయోజనమైతే… కలిగినవారికి ఫ్యాషన్! ఇలా అందరి మదిని దోచుకుంటున్న జూట్ తయారీలను మనం కూడా ఆహ్వానించేద్దాం. ఇంకెందుకాలస్యం మీరు కూడా జూట్ తయారీలను కొనేసుకోండి. డబ్బుకు డబ్బు ఆదా… పర్యావరణ పరిరక్షణకు మన వంతు సాయం చేసినవారిమవుదాం..!
- శాంతిశ్రీ
No comments:
Post a Comment