Friday, November 19, 2010

దుబాయిలో జీవన చిత్రం

- శాంతిశ్రీ
మనిషి నిరంతర అన్వేషి. కొత్త విషయాలను తెలుసుకోవడం మన ప్రవృత్తిలోనే దాగుంది. మరో ప్రాంతపు సంస్కృతీ సాంప్రదాయాలను తెలుసుకోవడం, అందులోని మంచిని గ్రహించడం ఎంతో ఆసక్తి కలిగించే అంశం. అదే మనిషి ఎదుగుదలకు, వ్యక్తిత్వ నిర్మాణానికీ మూలకేంద్రం. ఆ కుతూహలమే నాకు తెలియని మరో ప్రపంచాన్ని నా ఎదుట నిలిపింది. నా విజయవాడ ప్రయాణం అనుకోని వ్యక్తుల పరిచయానికి దారితీసింది. ఆ పరిచయం మరో దేశపు అలవాట్లు, ఆచారాలు తెలుసుకునే వేదికగా మారింది. రిజర్వేషన్‌ లేకపోవడంతో జనరల్‌బోగీలో ఎక్కిన నాకు ఎదురుగా వున్న మహిళ వేషభాషలు, తీరుతెన్నులు ఆమె ఆర్థిక ఉన్నతిని తెలియజేస్తున్నాయి. ఆమె ఇలా జనరల్‌బోగీలో ప్రయాణం చేయాల్సిన పరిస్థితేంటో అనుకున్నా... అడగడం సభ్యతకాదని ఊరుకున్నా.


తలవని తలంపుగా ఆమె మాటలు కలిపింది. తాము దుబారు నుండి వచ్చి వరంగల్‌ వెళుతున్నట్లు చెప్పింది. ఆమె అస్సలు కొత్తలేకుండా కలుపుగోలుగా మాట్లాడుతుండేసరికి దుబారు విశేషాలు అడగాలని అనిపించింది. 'దుబాయిలో పరిస్థితులు ఎలా ఉంటాయో వివరించరూ' అన్నాను. అప్పటికే నా చేతిలోని కథల పుస్తకాన్ని గమనించిందో ఏమో... 'ఏమిటీ ఇవన్నీ తెలుసుకుని కథలు రాసేస్తారా.. ఏంటి?' అంటూనే.. చెప్పటం ప్రారంభించింది.

'నా పేరు మధుమతి. నేను లా చేశాను. కానీ అక్కడ రాజ్యాంగం, పద్ధతులు వేరు. పైగా అక్కడ మహిళలు బయటకు స్వేచ్ఛగా తిరగగలిగే పరిస్థితులుండవు. ఉద్యోగం చేయాలంటే కొద్దిగా కష్టమే. అందులోనూ న్యాయవాదవృత్తి మరింత కష్టం. అందుకే ఇంటికే పరిమితమైపోయాను. అక్కడ మన సంప్రదాయాలు, ఇష్టాయిష్టాలతో ప్రమేయంలేకుండా ప్రతిఒక్కరూ బురఖా ధరించాల్సిందే. ఇది చూడబోతే ఆడవారిపై ఆంక్షలాగా అనిపిస్తుంది. కానీ అక్కడ స్త్రీలను వేధిస్తే చాలా పెద్ద శిక్షలే వేస్తారు. చిన్న తప్పుచేస్తే ఒక కూడలిలో బహిరంగంగా స్తంభానికి కట్టేసి, కొరడా దెబ్బలు కొడతారు. తప్పుల తీవ్రతను బట్టి చెయ్యి, కాలు నరికేస్తారు. మరీ పెద్ద తప్పయితే చంపేస్తారు కూడా. అందుకనో ఏమో అక్కడెవరూ మహిళలపట్ల అగౌరవంగా ప్రవర్తించరు. ఈ పద్ధతులు మన దేశంలో వుంటే ఈ యాసిడ్‌దాడులు, ఉన్మాదుల అరాచకాలు వుండేవి కావేమో'' అంటున్న ఆమె అభిప్రాయం సరైందనిపించింది. జరుగుతున్న ఘోరాలు అలాగున్నాయి మరి!

అక్కడ వివాహపద్ధతులు ఎలా వుంటాయని అడగ్గానే, ''అక్కడి వివాహ పద్ధతులు బావుంటాయి. ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే తన కుటుంబాన్ని పోషించగలిగే స్థోమత కలిగుండాలి. పైగా అక్కడ కన్యాశుల్కం వుంది. అంత డబ్బు ఇవ్వగలిగే పరిస్థితి ఉంటేనే వివాహం. అలా లేకుండా వివాహం చేసుకుంటే శిక్ష తప్పదు. అబద్ధాలు చెప్పినా శిక్ష కఠినంగానే ఉంటుంది. అదంతా చూస్తుంటే ఇలాంటి పద్ధతి మన దేశంలోనూ ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది'' అన్నారు. ''అవును. వరకట్న వేధింపులు ఉండేవే కావు' అని నిట్టూరుస్తూ, ''అక్కడ మనవాళ్లంతా కలుసుకుంటారా?'' అని అడిగాను. వెంటనే ఆమె ముఖంలో ఉత్సాహం. ''బాగా కలుస్తాం. ఇష్టమైన వంటలు చేసుకుంటే ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటాం. తెలుగువాళ్లమంతా పిల్లల్ని స్కూలుకు పంపించేప్పుడు కలుసుకుంటుంటాం. అక్కడే అన్ని విషయాలు మాట్లాడుకుంటాం. కుల మతాలకతీతంగా అందరం కలిసికట్టుగా జీవిస్తాం. షాపింగులకు, షికార్లకు కలిసేవెళ్తాం. పండుగలకు పిండివంటలు పంచుకుంటాం. అన్నింటికీ ఒకరికొకరు తోడూనీడగా వుంటాం. అక్కడున్న తెలుగు మహిళలకంటూ ఒక ప్రత్యేక సైటు ఏర్పాటుచేసుకుంటాం. మా కబుర్ల కలబోతలన్నీ అందులోనే!'' అంటూ ఆపకుండా చెప్పేసింది.

అక్కడి చదువులెలా వుంటాయో తెలుసుకోవాలనిపించింది. వెంటనే నా అనుమానం ఆమె ముందుంచాను. ''అక్కడ సెంట్రల్‌ సిలబస్‌ ఉంది. కాకుంటే అక్కడ టీచర్లకన్నా తల్లిదండ్రులకే ఎక్కువ బాధ్యత. ఇక్కడ ప్రాజెక్ట్‌ వర్క్‌లు ఎక్కువ. కానీ వాటివల్ల పిల్లల్లో సృజనాత్మక పెరుగుతుంది. పిల్లలే ప్రశ్నలకు సమాధానాలు తయారుచేయాలి. ఐదవ తరగతి నుంచి ప్రశ్నలు కూడా పిల్లలే తయారుచేయాలి. ఈ పద్ధతిలో రాయాలంటే పాఠం ఆసాంతం చదవాల్సిందే కదా! ఇదంతా పెద్దలకు కొంత భారమే అయినా పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని చేయాల్సిందే. ఇక్కడలాగా బట్టీపట్టటడం అక్కడ కుదరదు'' అన్నారు.

మన పండుగలకు ఏం చేస్తారని అడిగిన దానికి సమాధానం ఆమె అభిమతాన్ని తెలియజేసింది. 'ఇక్కడలాగా వ్రతాలు, నోములు చేసుకోడానికి కుదరదు. కాకపోతే ఇంట్లోనే పూజ చేసుకుంటాం. ఇక్కడి నుండి దేవుడి ఫొటోలు తీసుకెళ్లడానికి అనుమతించరు. రహస్యంగా పప్పుడబ్బాల్లో, బట్టల్లో దాచి తీసుకెళ్లాలి. దానికంటే నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌చేసి ప్రింట్‌ తీసుకోవడం సులువు. ఇక వారి పండుగల గురించి చెప్పుకోవాలంటే.. రంజానే. ఆ మాసమంతా అక్కడ చాలా బాగుంటుంది. ఆ అలంకరణ చూడముచ్చటగా వుంటుంది. ఎవరు ఏ దేశం నుండి వచ్చినా, ఏ మతం వారైనా ఆ నెలంతా వారి ఆచారాలను పాటించాల్సిందే. రంజాన్‌ మాసాన్ని ముస్లింలు చాలా నిష్టగా చేస్తారు. అందరూ ఎంతో ఐక్యంగా, స్నేహంగా ఉంటారు. ఆహారాన్ని అందరికీ పంచుతారు. దానధర్మాలు చేస్తారు. అలా వాళ్లను చూస్తే ముచ్చటేస్తుంది'' అని వివరించారు.
మీ బాబు తెలుగు బాగానే మాట్లాడుతున్నాడే అనగానే, ''మేం ఇంట్లో తెలుగే మాట్లాడతాం. అందుకే వారికి తెలుగు బాగా వచ్చు. బైటికెళ్తే మాత్రం ఉర్దూ, అరబ్బీ కలిపేసి మాట్లాడతాం. స్నేహితులమంతా కలిశామంటే తెలుగులోనే మాట్లాడుకుంటాం. ఎంతయినా మన దేశం, మన భాష గొప్పవి వాటిని మరిచిపోలేం. అందుకే సమయం చిక్కినపుడల్లా పిల్లలకు మన పద్ధతుల గురించి చెపుతుంటాను''... అంటుండగానే వరంగల్‌ దగ్గరపడింది. ఇక ఉంటానంటూ ఆమె అందరికీ వీడ్కోలు పలికింది.

మొత్తానికి మధుమతి పరిచయం దుబాయి గురించిన చాలా సంగతులను తెలియజేసింది. మన పద్ధతులను ఆచరిస్తూనే ఇతర మతాల మంచిని గ్రహించడం, ఆచరించడం బాగుంది. అలాగే పరాయిదేశంలో వున్నా ఒకరికొకరు సాయం చేసుకోవడం ఎంతో నచ్చింది. మతాలు, దేశాలు వేరైనా కొన్ని పద్ధతులు మన దేశంలోనూ ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయేమోనన్న అభిప్రాయం కలిగింది. కానీ కొన్ని విషయాలలో అక్కడి మహిళల స్థితిగతులు వెనుకబడే వున్నాయనిపించింది. భావస్వేచ్ఛలేని జీవితాలు అక్కడివి. కానీ అవసరంకోసం ఎవరు ఏ దేశానికెళ్లినా అక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకుని అందుకు అనుగుణంగా జీవించడంలోనే మనిషి మనుగడ వుంటుందనే వాస్తవం ఆకళింపుకొచ్చింది.

No comments:

Post a Comment