Sunday, November 21, 2010

బాలోత్సాహం వెల్లివిరిసిన బాలోత్సవ్‌

  - శాంతిశ్రీ

అనగనగా కథలు..
బుడి బుడి నడకలు..
బుజ్జి బుజ్జి రాగాలు..
చిట్టి చిట్టి కవితలు..
చిన్ని చిన్ని చిత్రాలు..
కేరింతలు.. తుళ్లింతలు..
ఆనంద డోలికలు.. ఆహ్లాద వీచికలు..
మధురం.. సుమధురం..
'బాలోత్సవ్‌-2010' పిల్లల పండుగ..
అంబరాన్ని అంటిన సంబరాలు..
ఆద్యంతం హర్షాతిరేకాలు.. హరివిల్లులు... చిరుజల్లులు..
'బాలోత్సవ్‌-2010' బాలల్లో ఉత్సాహాన్ని నింపింది. నల్ల బంగారానికి పేరుగాంచిన కొత్తగూడెం ఆ మూడురోజులూ బంగారు బాలలకు చిరునామా అయ్యింది. పసివారి పసిడికలల సాకారానికి కేంద్రమైంది. ఎటు చూసినా చిన్ని చిన్ని తల్లులు.. చిట్టి చిట్టి నాన్నలు.. ఆ చిన్నారుల వెన్నంటే గురువులు.. తల్లిదండ్రులు.. పెద్దలంతా తమ బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటే.. మరికొందరు తామే పిల్లలమైపోతే ఎంత బాగుండనుకున్నారు.. ఇంకొంతమంది బాలల్లో బాలలైపోయారు.. 'బాలోత్సవ్‌' సంబరాలు అంబరాన్ని తాకాయి. చిట్టి పొట్టి చిన్నారుల చిత్ర, విన్యాసాలను 'బాలోత్సవ్‌' వెలుగులోకి తెచ్చింది. వారిలోని సృజనాత్మకతకు పదును పెట్టింది. ఆ ప్రాంగణంలో జరిగే చిన్నారుల కళారూపాలను చూడటానికి రెండు కళ్లూ, మూడురోజులూ సరిపోవంటే అతిశయోక్తి కాదు. విశ్వ ప్రయత్నం చేసినా ఇంకో వంతు వీక్షించలేకపోయామనే అసంతృప్తి మిగిలిపోయిందంటే ఆశ్చర్యం లేదు. ఆ ఉత్సవాలను ఆద్యంతం చూడాలంటే పది అవతారాలెత్తి.. ఇరవై కళ్లుండాలని పిస్తుంది. భారతదేశంలోని బాల్యమంతా ఇలాంటి ఆనందోత్సాహాలతో తులతూగాలని కోరుకోవడం అత్యాశ కాదేమో..! ఆరోజు తప్పకుండా రావాలని.. అలాంటి వ్యవస్థకు ఇలాంటి పెద్దలంతా సహకరించాలని కోరుకుందాం..!!


రాష్ట్రస్థాయి అంతర్‌ పాఠశాలల సాంస్కృతిక ఉత్సవాల కళావేదిక 'బాలోత్సవ్‌-2010'. ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఘనంగా జరుపుకుంది. కొత్తగూడెం క్లబ్‌ ఆధ్వర్యంలో 20 ఏళ్ల క్రితం ఆరంభమైన ఈ ఉత్సవాలకు ఈ ఏడాది 'ద్విదశాబ్ది బాలోత్సవ్‌'గా నామకరణం చేశారు. ఈ బాలోత్సవాల్లోనే పునాది వేసుకొని, నేడు ప్రవర్ధమాన బాల గాయనిగా ఎదిగింది. ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాల బాల వి.నాగవినీష. ఆమె చేత పతాకావిష్కరణ చేయించడం నిర్వాహకుల మనోభీష్టాన్ని చెప్పకనే చెప్పినట్లైంది. ప్రారంభసభలో నాగవినీష పాడిన 'హిమగిరి సొగసులు', ఈ బాలోత్సవ్‌ నుండే అమెరికా వరకూ వెళ్లగలిగిన పాటల పూదోట అందెశ్రీ ఆలపించిన 'జల జల పారే సెలయేరమ్మా..' పాట ప్రేక్షకులను అలరించాయి.రాష్ట్ర నలమూలల నుండి 15 వేల మంది విద్యార్థులు ఈ సాంస్కృతిక పోటీల్లో పాల్గొన్నారు. 23 జిల్లాల నుండి సుమారు 300 పాఠశాలల విద్యార్థులు ఎంట్రీలు నమోదు చేసుకున్నారు. ఈసారి గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరుకావడం విశేషం. ఈ ఉత్సవాల్లో కిండరీ నుండి హైస్కూల్‌ విద్యార్థుల వరకూ పాల్గొనేలా నిర్వాహకులు చేసిన ఏర్పాట్లు అభినందనీయం. దూర ప్రాంతాల నుండి వచ్చిన వారందరికీ ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించిన తీరు ప్రశంసనీయం.

చిత్రలేఖనం, తెలుగు మాట్లాడదాం, లఘుచిత్ర సమీక్ష, కవితా రచన, చిత్ర (పోస్టర్‌) విశ్లేషణ, కథా విశ్లేషణ, క్విజ్‌, కథా రచన, అనగా అనగా.. కథ చెబుతా వింటారా!, భరతనాట్యం, కూచిపూడి, జానపద నృత్యాలు, విచిత్ర వేషధారణ (ఫ్యాన్సీడ్రెస్‌), లేఖారచన, సినీ, లలిత, జానపద గీతాలు, వక్తృత్వం, వ్యర్థంతో అర్థం, వాద్య సంగీతం, గ్రూప్‌ డాన్స్‌, నాటికలు.. మొదలైన 20 అంశాలను 36 విభాగాలు చేశారు. జూనియర్స్‌, సబ్‌ జూనియర్స్‌, సీనియర్స్‌ కేటగిరీలుగా నిర్వహించారు.ఇక ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడానికి కెసిపి, నోవా అగ్రిటెక్‌ వంటి ప్రముఖ సంస్థల అధినేతలు, సింగరేణి ఉన్నతాధికారులు, ఎందరో శ్రేయోభిలాషులు, సాంస్కృతిక, సాహిత్యాభిలాషులు, కొత్తగూడెం వాసులు ఆర్థికంగా, హార్ధికంగా సహకరించారు. వారందరికీ 'బాలోత్సవ్‌' బాలలందరూ జేజేలు చెప్పాల్సిందే. మండల స్థాయి నుండి రాష్ట్రస్థాయికి ఎదిగిన ఈ 'బాలోత్సవ్‌ జాతీయ స్థాయికీ ఎదగాలని ఆకాంక్షిద్దాం... విద్య ఉన్నత వ్యక్తుల్ని చేస్తుంది కానీ.. దానికి వికాసం తోడైతే ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారు. ఇలాంటి 'బాలోత్సవ్‌'లు అందుకు ఆలవాలమయ్యాయి. భవిష్యత్తరాన్ని అందుకు పురికొల్పేలా పోటీ అంశాలు ఉన్నాయి.మరో విశేషమేమంటే ఈ మూడురోజులూ పిన్నలకూ, పెద్దలకూ 'ప్రజాశక్తి బుక్‌స్టాల్‌' ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

పల్లె వెలుగు నింపిన జానపదం..
కళారూపాలన్నింటిలో జానపదం ప్రత్యేకంగా నిలిచింది. పల్లె వెలుగుతో 'బాలోత్సవ్‌' వెలిగి పోయిందంటే అతిశయోక్తి కాదు. పట్టణాల్లోని కార్పొరేట్‌ సంస్కృతిలో కొట్టుకుపోతున్న వారికి అచ్చమైన పల్లెతనం పంచాయి. జానపద నృత్యాలు చేసిన చిన్నారులు ఆహుతులందరి హృదయా లను పులకరింపజేశారు. మూడేళ్ల చిన్నారి నుండి 15 ఏళ్ల బాల బాలికలు మూడురోజులూ తమ జానపద నృత్యాలతో మన తెలుగు సంస్కృతిని కళ్లకుకట్టారు. కనుమరుగవుతున్న జానపదానికి జీవం పోశారు. ఉత్సవాలకు వచ్చిన ముప్పావువంతు వీక్షకుల్ని కదలకుండా కట్టిపడేశారు. పాటల పూదోట అందెశ్రీ, రేలరేల, ఆట కార్యక్రమాల్లో పేరుగడించిన గానకోకిలలు న్యాయనిర్ణేతలుగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వీరంతా తమ గుభాళింపులను జానపద పూదోటలో వెదజల్లారు. జానపదానికి చిరునామా అయిన గోరేటి వెంకన్న, సుప్రసిద్ధ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ ఈ పూదోటకు వచ్చి ఆ పరిమళాల్ని ఆస్వాదించారు.

రమేష్‌ మామయ్య మనస్సులో మాట..
అంతరించిపోతున్న మన సంస్కృతి, కళలు, సాంప్రదాయాలను నేటితరం బాలలకు అందించే లక్ష్యంతోనే ఈ 'బాలోత్సవ్‌'ను నిర్వహిస్తున్నానన్నారు రూపశిల్పి డాక్టర్‌ వాసిరెడ్డి రమేష్‌బాబు. ఆరంభం నుండి దశాబ్ధం పాటు ఈ ఉత్సవంలో ఛటర్జీ అనే అధ్యాపకుడు చేసిన కృషి మరువలేనిదన్నారు. నేటితరం బాలలు తెలుగు ఆస్వాదించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పుస్తకాలు, తరగతిగదుల మధ్య ఎంతో ఆనందాన్ని అనుభవించాల్సిన బాల్యం ప్రస్తుత విద్యావిధానంతో, ర్యాంకుల ఒత్తిళ్లతో తల్లడిల్లిపోతోందన్నారు. ఇది ఇలాగే కొనసాగితే భావితరం ఏమవుతుందోనన్న ఆందోళనే ఈ చిరు సంకల్పానికి తనను ప్రేరేపించిందన్నారు. భావితరమైన నేటి పసిమొగ్గలను ప్రకృతి సిద్ధంగా విరయనివ్వాలన్నదే తన ఆకాంక్షన్నారు. అవి సుగుంధ కుసు మాలు కావాలన్నది తన కోరికని చెప్పారు. ఆ విధంగా 1991లో మొగ్గగా ఉన్న ఈ 'బాలోత్సవ్‌' నేడు పువ్వుగా వికసించిందన్నారు. ఈ పువ్వు తన పరిమళాన్ని దశదిశలా వ్యాపించేలా చేయా ల్సిన బాధ్యత, ఆ పువ్వుని వాడిపోకుండా కాపాడాల్సిన కర్తవ్యం మనందరిపైనా ఉందన్నారు.

వికసించిన స్నేహాలు
పట్టణాలు, పల్లెల నుండి వచ్చిన విద్యార్థుల మధ్య స్నేహాలు వికసించాయి. కార్పొరేట్‌, జిల్లా పరిషత్‌ స్కూల్స్‌ నుంచి వచ్చిన పిల్లల మధ్యా మైత్రీ బంధం ఏర్పడింది. 20 ఏళ్ల నుండి పాల్గొంటున్నవారు కొందరు స్నేహితులుగా హాజరవడమే ఇలాంటి స్నేహాలకి ఈ 'బాలోత్సవ్‌' వేదికైందనడానికి నిదర్శనం. అలా ఎంతమంది హాజరయ్యారో అంచనా లేదుగానీ.. నిత్యం కొత్తవారికీ.. కొత్త స్నేహాలకూ ఇది వేదికవుతుందన్నది మాత్రం వాస్తవం. అంతేకాక అన్ని అంశాల్లోనూ చిన్నారులు స్నేహపూర్వకం గానే పోటీపడ్డారు. తమలోని సృజనాత్మ కతకు పదునుపెట్టారు. తమ బుజ్జి బుర్రల్లోని మేధస్సుతో ఆట, పాటల్లో, రచనల్లో, నాటికల్లో.. చక్కని తెలుగు మాట్లాడి.. తేట తేట వెలుగులు నింపారు. కొందరు సందేశాలూ ఇచ్చారు. వారి చిట్టి పొట్టి మాటలతో, కథా, కవితా రచనలతో తమలోని ఆలోచనల్ని వెల్లడించారు. తాము తెలుసుకున్న నీతుల్ని, సూక్తుల్ని తోటివారితో పంచుకున్నారు. రాబోయే ప్రమాదాలను తెలియజేసి, మేలు కొమ్మంటూ హెచ్చరించారు. జానపదం, భరతనాట్యం, కూచిపూడి, సంగీతం వంటి సాంప్రదాయ కళల్లో తమ ప్రతిభా పాటవాలను చాటుకున్నారు. చిన్నారులు వాయిద్యాలను అతి మధురంగా వాయించి, వీక్షకుల మదిని మీటారు.

ఆలోచింపజేసిన థీమ్‌పార్కు...
మూఢనమ్మకాలు వద్దంటూ మొదలుకుని.. గ్రామాల్లో పరిపాలన, రామా యణం వంటి పురాణగాథలను, నాటి గురుకుల విద్యను, సంక్రాంతి వంటి పల్లె పండుగల వరకూ ఏర్పాటు చేసిన 'థీమ్‌ పార్కు' ఆహుతులందరినీ ఆకట్టుకుంది. ద్వారానికి కుడివైపుగా ఏర్పాటు చేసిన ఈ థీమ్‌పార్కు వద్ద చిన్నారులు అనేకమంది నిలబడి ఫొటోలు తీయించుకోవడమే వారికిది ఎంతగా నచ్చిందో తెలియజేస్తోంది.

ఆ ఆరుగురు...
ఈ బాలల బ్రహోత్సవానికి రూపశిల్పి డాక్టర్‌ రమేష్‌బాబు అయితే.. ఆయన వెనుక రథ సార థులు ఆరుగురు ఉన్నారు. వారు డాక్టర్‌ కె.ఎస్‌.వి. శర్మ, ఆర్కాట్‌ చంద్రశేఖర్‌, పి.మాధవరావు, మల్సూర్‌, సుబ్రహ్మణ్యం, త్రివేదుల మూర్తి. వీరం తా వారంరోజుల పాటు ఒక్క నిముషమైన కంటి మీద కునుకు లేకుండా ఈ ఉత్సవాల్ని జయ ప్రదం చేసేందుకు శ్రమించారు. వారికి జేజేలు.
అలుపెరుగని వాలంటీర్లు...
చిన్నారులను కంటికి రెప్పలా కాపాడిన వాలంటీర్ల కృషి ప్రశంసనీయం. అందుకు ఎన్‌ సిసి, ఎంబిఏ విద్యార్థులు, స్వచ్ఛందంగా వచ్చిన అనేకమంది చేసిన కృషి అభినందనీయం. ఉద యం అల్పాహారం మొదలుకొని భోజనాల వర కూ మూడురోజులూ ఎటువంటి ఇబ్బందీ, అనా రోగ్యం కలగకుండా వండి, పెట్టిన వారికి జేజేలు. ప్రముఖులు మొదలుకొని చిన్నారుల వరకూ అందరికీ ఒకే భోజనం పెట్టడం నిర్వాహకుల సమదృష్టికి నిదర్శనం.. ఆదర్శనీయం.

No comments:

Post a Comment