Friday, November 19, 2010

చలికాలంలో జాగ్రత్తలు

రోజూ ఉదయాన్నే లేవగానే గడియారం చూస్తే చిన్న ముల్లు పెద్దముల్లుతో పోటీపడి పరిగెడుతున్నట్లు అనిపిస్తోంది కదూ! మరోపక్కేమో మంచంమీద నుంచి లేవబుద్ధి కావడంలేదు కూడా! మరి వాతావరణం చల్లగా చల్లగా ఉంటే అలాగే ఎంతసేపైనా పడుకోవాలనిపిస్తుంది ఎవరికైనా. ఎందుకంటారూ? ఎందుకేంటండీ... చలికాలం ఆరంభమైంది కదా మరి! ఈ చలికాలం మన టైమును తినేయడమే కాదు మన శరీరంమీదా అనేక ప్రభావాలు చూపిస్తుంది. ప్రధానంగా చర్మం మీద దీని ప్రభావం చాలా ఎక్కువ. ఈ కాలంలో చేతులు, పాదాలు, పెదాలు, జుట్టుకు ఎదురయ్యే సమస్యలకు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరి... మరి ఆ చిన్నపాటి జాగ్రత్తలు ఏమిటో మీరే చదవండి...



* కొద్దిగా నువ్వుల నూనె తీసుకొని శరీరానికి పట్టించి గంట తర్వాత గోరువెచ్చని నీటితో
స్నానంచేస్తే చర్మం పొడిబారదు.
* రాత్రిపూట వెన్న లేదా నెయ్యి రాసుకుంటే పెదాలు మృదువుగా ఉంటాయి.
* పాదాలు, చేతులు పొడిబారిపోయి, పగుళ్ల బారిన పడకుండా మాయిశ్చరైజర్‌తోగాని, కోల్డ్‌క్రీమ్‌తోగాని చేతుల్ని ఐదు నిమిషాలపాటు మర్దనాచేయాలి.
* ఈ కాలంలో చెప్పులకన్నా షూసే మేలు. ఇవి పాదాలు పగలకుండా కాపాడతాయి.
* షూస్‌ వేసుకోవడానికి ఇబ్బందిపడేవారు పాదాలకి సాక్స్‌ వేసుకుంటే పగుళ్లబారి నుంచి ఉపశమనం లభిస్తుంది.
* బైటికెళ్ళినప్పుడు హ్యాండ్‌బ్యాగ్‌లో కోల్డ్‌క్రీమ్‌, లిప్‌కేర్‌ వేసుకుంటే బెటర్‌.
* తలస్నానం చేసే ముందు నువ్వుల నూనెను కొద్దిగా వెచ్చజేసి తలకు బాగా పట్టించాలి. రెండు, మూడు గంటల తర్వాత కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు పట్టులా మెరుస్తుంది.
* ఈ కాలంలో జుట్టు బాగా ఊడిపోతుంది. కొబ్బరినూనెను కొద్దిగా వెచ్చజేసి తలకు పట్టించాలి. వేడినీటిలో ముంచిన టర్కీటవల్‌ను పిండి, తలకు చుట్టుకుంటే జుట్టు ఊడటం తగ్గుతుంది.
* తలస్నానం చేశాక ఒక మగ్గు నీళ్లలో ఒక నిమ్మకాయ రసం కలిపి తలపైనుంచి పోసుకుంటే అది జుట్టుకు మంచి కండిషనర్‌లా పనిచేస్తుంది.

* రాత్రి పడుకునే ముందు ఆముదంలో కొద్దిగా పసుపు కలిపి రాసుకుంటే పాదాలు మృదువుగా ఉంటాయి.
* అరబకెట్‌ గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు, షాంపూ వేసి మోకాళ్లు మునిగేలా ఉంచాలి. ఇప్పుడు స్క్రబ్‌ లేదా పాత టూత్‌బ్రెష్‌తో పాదాలు రుద్దితే మృతకణాలన్నీ పోతాయి. తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడుక్కొని మెత్తటి బట్టతో పాదాలను తుడవాలి. తరువాత పాదాలకు కొద్దిగా కొబ్బరినూనె లేకుంటే వేజలీన్‌ లేదా కోల్డ్‌క్రీమ్‌ను రాయాలి. ఇలా అప్పుడప్పుడూ చేస్తుంటే మీ పాదాలు నున్నగా ఉంటాయి.ఈ జాగ్రత్తలు పాటిస్తే చలికాలం సమస్యలనుండి ఇట్టే దూరంకావచ్చు.

No comments:

Post a Comment