Tuesday, November 16, 2010

శ్రామికులే అంతిమ విజేతలు

వెయ్యేళ్ల మానవ సమాజ పరిణామక్రమంలో శ్రామికులే అంతిమ విజేతలు. ప్రముఖ రచయిత లియో హ్యూబర్‌మన్‌ తాను రచించిన మూలగ్రంథం ‘Man’s Worldly Goods’లో ఈ విషయాన్నే సుస్పష్టం చేశారు. ఈయన వివిధ దేశాలకు చెందిన ప్రాచీనకాలపు రికార్డులను అధ్యయనం చేసి, రచించిన పరిశోధనాత్మక గ్రంథం ఇది. దీన్ని 'మానవుడు-సంపద-సమాజం' అన్న పేరుతో తెలుగులో అందరికీ అర్థమయ్యేలా అనువదించేందుకు కొమ్మారెడ్డి
కేశవరెడ్డి, లంకిరెడ్డి శివన్నారాయణ చేసిన కృషి అభినందనీయం. ముందుమాటలో రచయిత పేర్కొన్నట్లు చరిత్రను ఆర్థిక సిద్ధాంతం ద్వారానూ ఆర్థిక సిద్ధాంతాన్ని చరిత్ర ద్వారాను వివరించడానికి ప్రయతించారు. ఆ రెండూ ఒకదానితో ఒకటి పెనవేసుకున్న విడదీయలేని బంధమని, దాన్ని అలా చూస్తేనే అర్థమవుతుందన్నారు. అలా చూడకపోతే అది శూన్యశాస్త్రం అవుతుందన్నారు. ఆయన ఈ పుస్తకం రచించడానికి తన భార్య చెప్పడానికి సాధ్యంకానన్ని విధాలుగా తోడ్పడ్డారని పేర్కొనడం సంతోషం కలిగించింది. మొత్తం పుస్తకాన్ని రెండు భాగాలుగా విభజించారు రచయిత. ఇందులో మొదటిది ఫ్యూడలిజం నుండి పెట్టుబడిదారీ విధానం.. రెండవది పెట్టుబడిదారీ విధానం నుండి.. మొదటి భాగంలో 13 అంశాలను వివరిస్తే, రెండో భాగంలో 9 అంశాలను వివరించారు. మొత్తం పుస్తకం 22 అంశాలతో సవివరంగా ఉంది. దీన్ని ఆసాంతం చదవడమంటే సమాజ చరిత్రను, ఆయా ఆర్థిక విధానాలను అర్థంచేసుకోవడమే.


ఆర్థిక విధాన సిద్ధాంతాలు ఎలా అభివృద్ధి చెందాయి? కొన్ని సిద్ధాంతాలు ఆయా చారిత్రక పరిస్థితులలోనే ఎందుకు పుట్టాయి? ఆనాటి సామాజిక జీవితంలో ఎందుకు పెనవేసుకుపోయాయి? అవి ఏవిధంగా అభివృద్ధి అయ్యాయి? ఏవిధంగా మార్పులకు లోనయ్యాయి? సామాజిక పరిస్థితులలో వచ్చిన మార్పుల కారణంగా అవి ఏవిధంగా తొలగిపోయాయి? లాంటి ప్రశ్నలకు చారిత్రకాధారాలతో కూడిన సహేతుకమైన జవాబులు ఈ పుస్తకంలో లభిస్తాయి. కొన్ని రాయితీలను సాధించుకొనేందుకు పాలకవర్గాలను ఆశ్రయించిన వర్తకులు క్రమంగా పాలనా వ్యవహారాలలో పట్టును సాధించి, ఆ తర్వాత కీలకమైన నిర్ణయాలు చేయించే, చేసే స్థితికి ఎలా ఎదిగారు? అనే ప్రశ్నకు శాస్త్రీయమైన జవాబు ఇందులో లభిస్తుంది. నీరు పల్లానికే ప్రవహించడం ప్రకృతి ధర్మం. తద్భిన్నంగా సంపద పైపైకి ఎలా ఎగబాకుతుందో వివరిస్తుందీ పుస్తకం.

వెయ్యేళ్ల మానవ జీవితాలను, సమాజ గమనాన్నీ ఈ పుస్తకం ఆవిష్కరించింది. సమాజ పరిణామక్రమానికి తొలి నుండీ భూమి కేంద్ర బిందువుగానే ఉంది. నేటి సమకాలీన సమాజంలోనూ అది ఎంతటి ప్రభావం చూపుతుందో మనందరం చూస్తున్నాం కూడా. నాడు భూమిపై ఆధిపత్యం ఉన్నవారే రాజులుగా, చక్రవర్తులుగా చలామణి అయ్యారని రచయిత పేర్కొన్నారు. ఆర్థిక వ్యత్యాసాలు సమాజాన్ని ఏరీతిగా ప్రభావితం చేస్తాయో రచయిత చక్కగా వివరించారు. ప్యూడల్‌శక్తుల ప్రభావం క్రమంగా తగ్గిపోయిన తరువాత ఆ స్థానంలో పురోగామిశక్తులు ఎలా బలపడ్డాయో కూడా వివరించారు. రాచరిక వ్యవస్థ సమాజాభివృద్ధికి ఆటంకంగా మారినప్పుడు భూస్వామ్య, పెట్టుబడిదారీశక్తులు అభ్యుదయ పాత్రను పోషించిన వైనాన్ని రచయిత వర్గ దృష్టితో విశ్లేషించారు. 17వ శతాబ్దంలో పాత సమాజాన్ని కూలదోసి, కొత్త సమాజాన్ని తీసుకొచ్చిన విధానాన్ని వివరించారు. రాచరికాన్ని కూలదోసి, అధికారంలోకి వచ్చిన శక్తులు తమ పాలనను సుస్థిరం చేసుకోవటానికి కొత్త రూపాల్లో పాత వాటినే అమలు చేశారన్నారు.

నాడు రాచరికాన్ని కూలదోయటానికి రైతాంగాన్నీ, శ్రామికశక్తులనూ మిత్రులుగా మలచుకున్న పెట్టుబడిదారులు నేడు కార్పొరేట్‌శక్తులుగా రూపాంతరం చెందడాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. ఇదే సమయంలో శ్రామికశక్తులు దోపిడీ, పీడనలకు గురవడాన్ని ప్రశ్నిస్తూ, వారిని సమాజాభివృద్ధిలో భాగస్వాములను చేయాలని, వారికి వాటా ఇవ్వాలనే సిద్ధాంతం ఎలా వెలుగు చూసిందో ఈ పుస్తకంలో వివరించారు. సమాజంలోని అన్ని వర్గాలకూ తలో సిద్ధాంతం ఉందన్నారు. ఇప్పుడు అన్నిదేశాల్లో పెట్టుబడిదారీ విధానం పోటీతత్వంలో ఉందని, ప్రజలకు కావాల్సిన వస్తూత్పత్తికన్నా తమ వద్ద ఉన్న వస్తువులనే అమ్ముకొనే విధానం అమలులో ఉందన్నారు. అయితే చైనా తదితర దేశాల్లో ప్రజలకు కావాల్సిన ఉత్పత్తులను తక్కువ ధరకు అందిస్తూ శ్రామికవర్గ సంస్కృతికి పెద్దపీట వేయడాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. అందుకే అక్కడ పెట్టుబడిదారీవర్గ సంక్షోభం లేదు. ఎక్కడైనా కార్మికవర్గ అవసరాలు తీర్చలేనప్పుడు సంఘర్షణ అనివార్యమవుతుందని రచయిత సుస్పష్టంగా పేర్కొన్నారు. ఈ సంఘర్షణలో శ్రామికవర్గమే అంతిమ విజేతని విస్పష్టం చేశారు.
-శాంతిశ్రీ

No comments:

Post a Comment