Friday, November 19, 2010

చిగురుటాకు

 (కథ)

- శాంతిశ్రీ

అనగా అనగా ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టుకు పెద్ద కాండం ఉంది. ఆ కాండానికి అనేక పెద్ద పెద్ద కొమ్మలు ఉన్నాయి. ఆ కొమ్మలకు చిన్ని చిన్ని రెమ్మలు ఉన్నాయి. ఆ రెమ్మలుకు కొన్ని పండుటాకులు, కొన్ని ముదురు ఆకుపచ్చరంగు ఆకులు, కొన్ని లేత ఆకుపచ్చరంగు ఆకులు, కొన్ని చిగురుటాకులు ఉన్నాయి. చల్లటి గాలి వీస్తోంది. ఆ చల్లటి గాలికి ఆకులన్నిటికీ జోకొట్టినట్లుంది. కొద్దిసేపటికి సూర్యకిరణాలు వెచ్చగా తగిలేటప్పటికి అవి ఉలిక్కిపడి లేచాయి. ఓ చిగురుటాకు ఆనందంతో కేరింతలు కొట్టింది. ఇంతలో దానికి ఓ చక్కని పాట లీలగా వినిపించింది. ఆలకిస్తున్న కొద్దీ చిగురుటాకుకు ఆ పాట చాలా సుమధురంగా అనిపించింది. ఆ పాట చుట్టూ ఉన్న చెట్లమీద నుంచి వినిపిస్తోందని చిగురుటాకు గమనించింది. ఈ పాటను మర్రి చెట్టుమీద పండుటాకులు కూడా విన్నాయి. అవి కూడా వాటితో గళం కలిపాయి.



చిగురుటాకుకు ఈ పాట ఎందుకు పాడుతున్నాయో అర్థంకాలేదు. పక్క ఆకును అడిగింది. 'పండుటాకులు రాలే సమయం వచ్చింది' అని చెప్పిందది.ఓహో ఆకులు రాలి కిందపడటంలో చాలా ఆనందం ఉందన్నమాట. లేకపోతే అవి ఇంత హాయిగా పాటలెందుకు పాడతాయి? తనకూ అలా కిందపడే యోగం లేదే అని బాధపడింది. చిగురుటాకుతన మనస్సులో మాటను తనపక్క రెమ్మకున్న ముదురాకుపచ్చరంగు ఆకుకు చెప్పింది. అది లేత ఆకుపచ్చరంగు ఆకుకు చెప్పింది. అది రెమ్మకు చెప్పింది. రెమ్మ కొమ్మకు చెప్పింది. కొమ్మ కాండానికి చెప్పింది. కాండం తల్లి చెట్టుకు చెప్పింది. తల్లి చెట్టు అంతా సావధానంగా విని.. 'ఓ నా బంగారు చిగురుటాకూ! తొందరపడకు, బాధపడకు. నన్నే అంటిపెట్టుకుని ఉండమ్మా. నీకు మంచి మంచి ఆహారం పెడతాను. చక్కగా తిను. ఎండలో చలికాచుకో. గాలితో ఆడుకో. పండుటాకుల్లా పాట పాడే సమయం అదే వస్తుంది. అప్పటివరకూ ఆగమ్మా..' అంటూ కబురు పంపింది. ఈ విషయాలన్నీ కాండం కొమ్మలకు చెప్పింది. కొమ్మలు రెమ్మలకు చెప్పాయి. రెమ్మలు ముదురు ఆకుపచ్చరంగు ఆకులకు చెప్పాయి. అవి లేత ఆకుపచ్చరంగు ఆకులకు చెప్పాయి. ఆ లేత ఆకుపచ్చరంగు ఆకులు చిగురుటాకును మెల్లగా నిమురుతూ చెప్పాయి.
'అలాగే! అమ్మ చెప్పినట్లే వింటాను' అంది చిగురుటాకు.

ఆ చిగురుటాకు అమ్మను అంటిపెట్టుకునే ఉంది. వాళ్లమ్మ పెట్టే మంచి మంచి ఆహారం కడుపునిండా తింది. ఎండలో చలి కాచుకుంది. గాలితో ఆటలాడుకుంది. కొంచెం పెద్దదై లేత ఆకుపచ్చరంగులోకి మారింది. ఇంకొంచెం పెద్దదై ముదురు ఆకుపచ్చరంగులోకి మారింది. రాను రాను ఆకుపచ్చరంగు తగ్గనారంభించింది. అక్కడక్కడా పసుపురంగు వచ్చింది. తర్వాత పూర్తి పసుపురంగులోకి మారిపోయింది.మళ్లీ పండుటాకుల పాట వినిపించింది. పండిన ఈ ఆకు కూడా ఆ పాట వింటూ మిగిలిన పండుటాకులతో పాటు తానూ గళం కలిపింది. చక్కగా పాట పాడింది. పాటతో పాటు చల్లగా వీచే గాలినీ ఆశ్వాదిస్తూ ఉంది. కొద్దిసేపటికి పండుటాకు చెట్టు నుండి వేరుపడింది. గాలిలో మెల్ల మెల్లగా తేలుతూ ఆ పండుటాకు నేలమీద పడిపోయింది.కింద బోలెడు ఎండుటాకులున్నాయి. వాటి మధ్య ఆ పండుటాకు పడగానే అవన్నీ గలగలా మంటూ పెద్దగా పాట పాడుతూ స్వాగతం పలికాయి. ఆ పండుటాకు కూడా వాటితో గళం కలిపింది. కొన్నిరోజులకు అది వాటిలాగే ఎండిపోయింది.

No comments:

Post a Comment