Wednesday, November 17, 2010

అక్టోబర్‌ విప్లవం .. స్ఫూర్తిదాయకం ..

- శాంతిశ్రీ   Sat, 6 Nov 2010,  

అదే అక్టోబర్‌ విప్లవం. ఇదే జారు చక్రవర్తికి, అతని రాజ్యానికి వ్యతిరేకంగా లెనిన్‌ నాయకత్వంలో జరిగిన 'బోల్షివిక్‌ విప్లవం'. పాత క్యాలెండర్‌ ప్రకారం ఆ విప్లవం అక్టోబర్‌ 17వ తేదీన జరిగింది. అందుకే అది 'అక్టోబర్‌ విప్లవం'గా పిలువబడింది. కొత్త క్యాలెండర్‌ ప్రకారం నవంబర్‌ 7వ తేదీ అవుతుంది. అందుకే నవంబర్‌ 7వ తేదీనే 'అక్టోబర్‌ విప్లవ దినోత్సవం'.సరే.. రష్యాలో అసలేం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. అది 1905వ సంవత్సరం. ఆ ఏడు రష్యాలో పెద్ద తిరుగుబాటు వచ్చింది. ప్రవాసంలో ఉన్న లెనిన్‌ తిరిగి వచ్చాడు. ఆయనే ఆ
పోరాటానికి సారథ్యం వహించాడు. కానీ ఆ విప్లవం విఫలమైంది. అయినప్పటికీ లెనిన్‌ ఏమాత్రం నిరుత్సాహపడలేదు. ఆ తర్వాత 1917 ఫిబ్రవరిలో రష్యాలో ఓ పక్క సైనికుల్లో నిరస నలు పెరిగిపోయాయి. మరోపక్క ప్రజలు కూడా జార్‌ చక్రవర్తంటే చాలా కోపంగా ఉన్నారు. అందరూ కలిసి జార్‌ చక్రవర్తిని సింహాసనం నుండి కూలదోశారు. ఆ తర్వాత 'కెరిన్‌స్కీ' అనే ఆయన అధికారంలోకి వచ్చాడు. ఈయన గారు కూడా ప్రజల ఆకాంక్షలను తీర్చలేకపోయాడు. అంతేకాదు ఆయన అసమర్థత వల్ల అప్పుడు జరుగుతున్న మొదటి ప్రపంచయుద్ధంలో రష్యా ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు రష్యాను కాపాడింది ఈ అక్టోబర్‌ విప్లవమే.


అది ఎలా జరిగిందంటే.. 'కెరిన్‌స్కీ'పట్ల ప్రజలూ, సైనికులూ చాలా అసంతృప్తిగా ఉన్నారు. సైనికుల్ని, కార్మికుల్ని, రైతులను బోల్షివిక్‌పార్టీ ఒక్కతాటి మీదకు తెచ్చింది. అప్పుడు రష్యాలో 'అందరికీ తిండి, దున్నేవానికి భూమి' అన్న నినాదాలు మిన్నంటాయి. 'సాధ్యమైతే శాంతియుత విప్లవం, కాని పక్షంలో పాలకశక్తులు హింసకు పాల్పడితే సాయుధ తిరుగుబాటు చేయాలి' అని లెనిన్‌ ప్రణాళికను రూపొందించాడు. విప్లవ శంఖాన్ని పూరించాడు. విజయం సాధిం చాడు. అప్పుడు నూతన కార్మిక, కర్షక సోవియట్ల ప్రభుత్వం ఏర్పడింది. యుద్ధం నుండి రష్యా బయటపడింది. దున్నే వానిదే భూమి అయ్యింది. ఆక్రమణలో ఉన్న ఫిన్లాండు, తదితర పొరుగు దేశాలు విముక్తి పొందాయి. రష్యాలో రాచరికం అంతమైపోయింది. 'సోవియట్‌ రష్యా' అవతరించింది.దోపిడీ వ్యవస్థను కూలదోసిన పదేళ్లలోనే అక్కడ సోషలిజం అధికారంలోకి వచ్చింది. మతానికి సంబంధించిన పాత సాంప్రదాయాలు తొలగిపోయాయి. స్త్రీ, పురుషులిద్దరూ సమా నమయ్యారు. పిల్లల, ముసలివాళ్ల బాధ్యత ప్రభుత్వమే తీసుకుంది. పిల్లల్ని తమ తల్లిదండ్రుల వద్దే ఉంచి.. వారి చదువు, పోషణ బాధ్యత ప్రభుత్వమే చేపట్టింది. ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది.

దీని ప్రభావం ప్రపంచంలో విస్తృతంగా వెళ్లింది. ఆయా దేశాల్లో అనేక మార్పులు వచ్చాయి. తద్వారా అక్కడ ప్రజలు అనేక ప్రయోజనాలు పొందారు. అంతేకాదు ఆ తర్వాత అనేక దేశాలు సామ్రాజ్యవాద దోపిడీ నుండి విముక్తి పొందాయి. చైనా, ఉత్తరకొరియా, తూర్పు యూరప్‌, వియత్నాం, క్యూబా వంటి దేశాల్లో సోషలిస్టు వ్యవస్థలు ఏర్పడ్డాయి.
పెట్టుబడిదారీ దేశాల దుష్ప్రచారం తదితర కారణాల వల్ల సోవియట్‌ రష్యా 1991లో పతనమైనప్పటికీ మానవాళి విముక్తికి సోషలిజం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని నేటి అనుభవాలు తేల్చి చెప్తున్నాయి.

No comments:

Post a Comment