ఉంటుంది... మాటలు నేర్చుకునేప్పుడు అనుకరిస్తారు. బుడి బుడి అడుగులతో నడక నేరుస్తారు.... ఆ పసితనంలో రానిది వచ్చేవరకూ పడే తపనే కనిపిస్తుంది. బాల్యంలో తెలియనిది తెలుసుకునేదాకా పట్టువదలరు. అదెలాగంటారు.. అయితే ఇది చదవాల్సిందే..
చిన్నపిల్లలు అడుగులు వేయడానికి ప్రయత్నించడాన్ని ఒకసారి చూడండి. పడతారు.. లేస్తారు.. నడుస్తారు.. మళ్లీ పడతారు.. మళ్లీ లేస్తారు.. మళ్లీ నడుస్తారు.. ఇలా ఎన్నిసార్లు పడతారో.. ఎన్నిసార్లు లేస్తారో.. ఎన్నిమైళ్లు నడుస్తారో లెక్కేలేదు.. నడక వచ్చేదాక దెబ్బలు తగిలినా ఆ కాసేపు ఏడుస్తారు.. ఆ తర్వాత మర్చిపోతారు.. అడుగులేసే వయస్సులో పసివాళ్లు రోజుకు ఆరేడు గంటలు నడక నేర్చుకోడానికే కేటాయిస్తారట! అంతేకాదు.. బాగా నడవడం వచ్చేసరికి ఓ క్రీడా మైదానాన్ని 30 సార్లు చుట్టొచ్చినంత దూరం నడుస్తారట! దాదాపు పదివేల మెట్లు ఎక్కి దిగుతారట! నడక రాగానే.. 'హమ్మయ్యా! సాధించాం! ఇక చాలు' అని అనుకోరట.. పరిగెత్తడం నేర్చుకుంటారు.. ఈత కొట్టడం నేర్చుకుంటారు.. ఆ ప్రయత్నాల్లో చేతులు గీసుకుపోతాయి. మోకాళ్లకు దెబ్బలు తగులుతాయి. అయినా వెనకడుగు వేయరు. ఆ బాధలు మర్చిపోతారు. నేర్చుకోవాల్సింది నేర్చుకునేదాకా వదిలి పెట్టరు. ఎంత పెద్దయినా ఇవి ప్రతి ఒక్కరికీ పసితనంలో 'పడిలేచే' పాఠాలు.
అంతేకాదు.. చిన్నపిల్లలు మాటలు వచ్చేటప్పుడు గమనించండి. మాటల్లో తప్పులు దొర్లితే ఎవరన్నా నవ్వుతారేమో అని ఆలోచించరు. ధైర్యంగా తప్పయినా మాట్లాడతారు. ఆ తర్వాత ఇది తప్పు.. ఇలా పలుకు అంటే అలా పలకడానికి ప్రయత్నిస్తారు. వచ్చేదాకా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇంట్లో ఒక భాష, వీధిలో ఒక భాష, బడిలో మరో భాష. తొలి దశలో కొంత తికమకపడతారు. అది సరిగ్గా వచ్చేవరకూ పట్టు వదలరు.. తొందర్లోనే దాన్ని పట్టేస్తారు.. పసిపిల్లలు రెండేళ్ల వయస్సు నుంచి పొద్దున్న నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునేలోపు సగటున గంటకో కొత్తపదం నేర్చుకుంటారని అంచనా. అవునా.. అంటూ ఆశ్చర్యపోకండి.. ఇది నిజంగా నిజం. అంతేకాదు పదిహేనేళ్లు వచ్చేసరికి పెద్ద పదకోశమే (డిక్షనరీ) తయారవుతుందట. ఆ తర్వాత ఎన్నేళ్లు బతికినా ఆ పదకోశంలో నిజంగా చేరే మౌలికమైనవి ఏ వేయిపదాలో రెండు వేల పదాలో. 'పెద్దయ్యాక కష్టపడి కొత్త భాషలు నేర్చుకున్నా, వచ్చేది అంతంత పరిజ్ఞానమే. చూశారా! జీవితంలో ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా మళ్లీ ప్రయత్నిస్తే తప్పక విజయం వరిస్తుందన్న మాట. మొత్తం మీద బాల్యం మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుందన్నమాట. మరి అందుకే పసిపిల్లల్లా తెలియంది తెలుసుకోవాలన్న తపన మనలో ఉండాలి. అప్పుడే నిత్యం నేర్చుకోగలమన్నమాట.
పసిపిల్లల్ని కల్మషం లేని వారంటాం. బాలల్లోని జిజ్ఞాస... ప్రతి ఒక్కరికీ అనుసరణీయం..
చిన్ననాడు తప్పటడుగులు సరైన అడుగులకు ప్రస్తానమైతే.. పెద్దయ్యాక వేసే తప్పటడుగులు అధోగతికి చేరుస్తాయి సుమా!
18 ఏళ్లలోపు వయస్సులో వివిధ రంగాల్లో
తమ వయస్సుకు మించిన మేధస్సు, ప్రతిభ కనబరిచిన వారి వివరాలు..
* చిత్రకారులు : పాబ్లో పికాసో
* గణితం : కార్ల్ ఫ్రెడెరిక్ గాస్, శ్రీనివాస రామానుజన్, దమ్మలపాటి విజయకృష్ణ,
* సంగీతం : మంగళంపల్లి బాలమురళీకృష్ణ
* చదరంగం : దాసరి సాయి శ్రీనివాస్, కోనేరు హంపి
* నాట్యం : జె.వి.సాయి తేజస్వి
* ఈత : వన్నం జ్యోతిసురేఖ
* జ్ఞాపకశక్తి : నిశ్చల్ నారాయణ్, కె.జి.యస్.అపురూప్.
- శాంతిశ్రీ
No comments:
Post a Comment